మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 7: 600 రోజుల రేవంత్‌రెడ్డి పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంత్యంత బాధాకరమని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫ్యలాలే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ దొంగ హామీలు నమ్మి ఆశపడి ఓటేస్తే ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సంపూర్ణ పంట రుణమాఫీ, రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్ తదితర హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మెదక్ కలెక్టరేట్ వద్ద రైతు మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు నర్సాపూర్, దుబ్బాక ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, శశిధర్‌రెడ్డితోపాటు నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేస్తున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతుభరోసాకు రాంరాం చెబుతారని.. ఆలోచన చేసి ఓటు వేయాలని, ఆశపడి ఓటు వేస్తే మోసపోతామని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్న కారణంతో కొంతమేరకు రైతుభరోసా వేశారని పేర్కొన్నారు.
ఎన్నికల హామీలు నెరవేర్చకుం డా రేవంత్ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిత్యం అన్ని జిల్లాల్లో ఎరువుల కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ హయాంలో 11 విడతల్లో రూ.72 వేల కోట్ల రైతుబంధు వేసినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.49 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి నేటి వరకు కేవలం రూ.21 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసిందని ధ్వజమెత్తారు. రైతుల కష్టాల గురించి నిలదీస్తే ఈ సర్కార్ ప్రతిపక్షాలను అణచి వేస్తున్నదని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులకు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.
మోదీని దించుతామని రేవంత్‌రెడ్డి పదేపదే అనడంపై బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందు కు స్పందించడం లేదని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. వీరి వ్యవహారం చూస్తుంటే మిలాఖత్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్ర బీజేపీ మోదీ వైపు ఉందా? రేవంత్ వైపు ఉందో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల, వెంకటరమణరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తప్ప మిగతా బీజేపీ వాళ్లు రేవంత్‌రెడ్డికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
మెదక్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : మెదక్ కలెక్టరేట్ ఎదుట గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ కార్యకర్తలా గాంధీ భవన్ నుంచి రాసి పంపే స్క్రిప్ట్‌ను కలెక్టర్ చదువుతారని విమర్శించారు.
ఇకపోతే పోలీసుల గురించి చెప్పాల్సిన అసవరం లేదని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ఎస్కార్ట్‌ను కాంగ్రెస్ నాయకులకు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మెదక్ జిల్లాకు పనికి మాలిన మంత్రి ఉన్నాడని, ఇంట్లో కూర్చొని పర్సంటేజీలు, కమీషన్లు దండుకుంటున్నాడని ఆరోపించారు. ఇన్చార్జి మంత్రికి మెదక్ జిల్లా గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులపై ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. జగ్గారెడ్డి పర్సంటేజీలు ఇస్తలేరని ఏడుస్తున్నాడని, కాంగ్రెస్ శ్రేణులు వాళ్లకు వాళ్లే కొట్లాడుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
నర్సాపూర్, ఆగస్టు 7 : రేవంత్‌రెడ్డి.. మేడిగడ్డను పడావు పెట్టి గోదావరి నీళ్లను బనకచర్లకు జారగొట్టాడని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురుదక్షిణ చె ల్లించడానికి బనకచర్లకు గోదావరి నీళ్లను జారగొడుతున్నాడని ఆరోపించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడా రు. రేవంత్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం వల్ల ఎంత మేలు జరిగిందో నీకు తెల్వకపోతే హల్దీ, మంజీర పరీవాహక ప్రాంత రైతులను అడిగితే చెప్తారు’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నుంచి నీళ్లు వదిలితే ఈ ప్రాం తంలో ఎండాకాలంలోనూ చెరువులు, చెక్‌డ్యామ్‌లు మత్తళ్లు దుంకాయని, కాళేశ్వరం నీళ్లు నర్సాపూర్ నియోజకవర్గంలో పారాయా? లేదా? పంటలు పండినయా లేదా? నేరుగా రైతులనే అడుగుదామని రేవంత్‌కు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో మెదక్‌లోని దుబ్బాక, నర్సాపూర్, మెదక్, రామాయంపేట, చిన్నశంకరంపేట తదితర మండలా ల్లో నీళ్లంది పంటలు పండిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం నీటితో ఒక్క ఎకరా పండలేదని రేవంత్‌రెడ్డి అనడం అవివేకమని అన్నారు. మేడిగడ్డ బరాజ్‌తో నిమిత్తం లేకుండా కన్నెపల్లి మోటర్లను ఆన్‌చేస్తే ఇప్పడు కూడా మెదక్ జిల్లాకు గోదావరి నీళ్లు తెచ్చుకోవచ్చని సూచించారు.
రేవంత్ సర్కార్ కమిషన్లు, కాలయాపనతో కాలం వెళ్లదీస్తున్నదని, అన్ని హామీలు అటకెక్కించిందని హరీశ్‌రావు మండపడ్డా రు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామని హోర్డింగ్‌లు పెట్టారని, కనీసం ఇప్పటి వర కు టెండర్లు పిలిచారా? ఒక ఇటుక పెట్టా రా? అని ప్రశ్నించారు. రెండేండ్లు అవుతు న్నా ఒక్క టెండర్ ఫైనల్ కాలేదని, కమీషన్ల లెక్క తేలనట్టు ఉన్నదని దుయ్యబట్టారు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలవడం జరిగిందని, ఎందుకంటే అందులో పర్సంటేజ్ చూసుకోవచ్చని అన్నారు. తొమ్మిది నెలలుగా బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తే, అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని అప్పుల పాల్జేశావని రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.