Mahabubabad | మహబూబాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : తనకు పాస్బుకు చేయాలని ఏడాదికిపైగా తిరుగుతున్న రైతుపైనే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన వల్లెపు కనకయ్య 1987లో చనిపోయాడు. ఇతనికి నలుగురు కుమారులు ఉన్నారు. వీరంతా బతుకుదెరువు కోసం హనుమకొండలోని జులైవాడకు వలస వెళ్లారు. ఊరి నుంచి వెళ్లేటప్పుడు వారి తండ్రి కనకయ్య పేరిట 20 గుంటల భూమి ఉన్నది. వీరి తల్లి వెంకటమ్మ 2005లో మరణించింది. అప్పటినుంచి ఆ భూమి తండ్రి కనకయ్య పేరు మీదనే పహాణీలో ఉన్నది. నలుగురిలో పెద్ద కుమారుడు నరసయ్య, రెండో కుమారుడు వెంకటయ్య కూడా చనిపోయారు. ఇక మూడో కుమారుడు యాదగిరి, నాలుగో కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. తండ్రి పేరు మీద ఉన్న భూమిని తమకు పాస్‌పుస్తకంగా ఇవ్వాలని ఏడాదికిపైగా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ధరణిలో దరఖాస్తు చేసుకున్నా పాస్‌పుస్తకం ఇవ్వకుండా కేసముద్రం రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తునారు.
ఈ విషయమై సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆర్ఐని తహసీల్దార్ 2024 సెప్టెంబర్ 13న ఆదేశించారు. అప్పటినుంచి సర్వే చేసి రిపోర్టు ఇవ్వకపోగా రేపు, మాపు అంటూ తిప్పుకొంటున్నారు. ‘ఆ భూమి మీది కాదని, ప్రభుత్వ భూమి’ అని రకరకాల సాకులు చెప్పారు. చివరికి రైతు శ్రీనివాస్‌తోపాటు వారి సోదరుల పిల్లలు అంతా కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. అయినా ఆ భూమి సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. విసిగిపోయిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆర్ఐని నిలదీశారు. దీంతో ఆమె గతనెల 25న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ రైతును పిలిపించి మాట్లాడగా అసలు విషయం వారికి అర్థమైంది. ఆర్ఐదే తప్పని తెలుసుకున్న పోలీసులు ఆమెను మందలించారు. తమకు జరిగిన అన్యాయంపై రైతు శ్రీనివాస్ సోమవారం మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మహబూబాబాద్ ఆర్డీవోను ఆదేశించారు.