హాజీపూర్, నవబంర్ 17 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలోని 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. ఇటీవల మొంథా తుపాన్ వల్ల కురిసిన వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరింది. ఆ సమయంలో అధికారులు నీటిని విడుదల చేయగా, 42 మత్తడికి గండి పడింది. దీంతో పెద్దంపేట శివారులో 150 ఎకరాల్లోని వరి, పత్తి పంటల్లోకి చేరింది. కడెం కాల్వ 42డీ-కి ఉన్న షటర్స్ను తెరిచి నీటిని కిందికి వదిలితే పంట నష్టం జరిగేది కాదని, కాల్వ షటర్స్ను ఎత్తకుండా ఉంచడంతోనే నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ విషయమై కడెం ప్రాజెక్టు అధికారులను వివరణ కోరగా.. కడెం ప్రాజెక్టు గేటుకు కర్ర మొద్దు అడ్డుపడిందని, దానిని తీసేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నం చేస్తున్నామని, కర్ర మొద్దు బయటకు వస్తే గేటును దింపి నీటిని నిలుపుదల చేస్తామని వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు 42వ ప్రధాన కాల్వపైన మత్తడికి గండి పడి జలప్రభ పథకంలో నిర్మించిన కుంట నిండి పొలాలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు.