Crop Loan Waiver | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. నెలన్నరలోగా ఈ కార్యక్రమానికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతిభవన్‌లో బుధవారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్ని కష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు.
నోట్లరద్దుతో ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం విషయం లో తెలంగాణపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కక్షపూరిత విధానం.. తదితర కారణాల వల్ల రుణమాఫీ కొంత ఆలస్యమైందని తెలిపారు. ఇప్పటికే అందించిన మాఫీ మొత్తం పోను మరో రూ.19 వేల కోట్లు రుణమాఫీ కింద రైతులకు అందించాల్సి ఉన్నదని చెప్పారు. రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచే పునఃప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతలవారీగా కొనసాగిస్తూ నెల పదిహేను రోజుల్లో సంపూర్ణంగా పూర్తిచేయాలని సూచించారు.
ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని విస్మరించం
రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధిని, రైతు సంక్షేమా న్ని విస్మరించబోమని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాలకుతోడు కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలవల్ల రుణమాఫీలో కొంత జాప్యం జరిగింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాటంకంగా కొనసాగిస్తూనే వస్తున్నది. ఎన్ని కష్టాలొచ్చినా, ఆరు నూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని విస్మరించే ప్రసక్తేలేదు. వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి ఆదర్శ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రై తు సాధికారత సాధించేవరకు, వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దేవరకు విశ్రమించే ప్రసక్తేలేదు’ అని స్పష్టం చేశారు. సమావేశంలో సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, హెచ్ఎండీఏ ప్రిన్సిప ల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు, కరోనా మహమ్మారి కారణంగా జరిగిన నష్టంతో ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీకి నిర్ణయించిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున కృతజ్ఞతలు. రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినా రైతులు వారి మాటలను విశ్వసించలేదు. రుణమాఫీపై కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి, రైతులకే తొలి ప్రాధాన్యం అనడానికి ఇదే నిదర్శనం.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
రైతుబాంధవుడు కేసీఆర్
ఇచ్చిన మాట ప్రకా రం రైతులకు పూర్తి రుణమాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మరోసారి నిరూపితమైనది. ఆర్థిక కష్టాలున్నా, రైతుల కోసం రూ. 19వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకమైనది. ఈ నిర్ణ యం తీసుకున్న కేసీఆర్‌కు రైతుల పక్షాన కృతజ్ఞతలు. రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి మరే రాష్ట్రం సాటిరాదు.
-గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి
రైతుల సంతోషం కోరే సీఎం
దేశంలో రైతుల సంక్షేమం, సంతోషం కోరే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. రాష్ట్ర మొదటి వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ఆయన ఎంతగా తపించేవారో ప్రత్యక్షంగా చూశాను. నా రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాను. కానీ రైతుల కోసం బాగు కోసం తపన పడే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు కృతజ్ఞతలు.
-పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభ స్పీకర్
రైతు పక్షపాతినని కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు
తాను రైతు పక్షపాతినని ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిరూపించుకున్నారు. నోట్ల రద్దు, కరోనా వంటి కారణాలతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం, కేంద్రం వివక్ష వల్ల రైతు రుణమాఫీ ఆలస్యమైంది. ఇప్పటికే ఇచ్చిన రుణమాఫీ పోను, మరో రూ. 19 వేల కోట్ల రుణమాఫీని మూడో తేదీ నుంచి ప్రారంభించి వచ్చే నెల రెండోవారానికి కల్లా పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశాలిచ్చారు. సీఎం ఆదేశాలతో రైతులు సంతోషంగా ఉన్నారు.
-మహమూద్ అలీ, హోంమంత్రి
రైతుగానే పుట్టాలని సంబురాలు చేసుకుంటున్నారు
రైతు సంక్షేమానికి దేశంలోనే ఏ నాయకుడూ ప్రవేశపెట్టని పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రైతు రుణమాఫీ ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞత లు. కేసీఆర్ రైతుల కోసం తీసుకుంటున్న చర్యల తో పుడితే తెలంగాణలో రైతుగా పుట్టాలని రైతులు కోరుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
-కోలేటి దామోదర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
రైతుల పాలిట కేసీఆర్ దైవం
సీఎం కేసీఆర్ రైతుల పాలిట దైవంగా మారారు. రుణమాఫీ నిర్ణయం తీసుకున్నందుకు రైతుల తరఫున సీఎంకు ధన్యవాదాలు. ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చినమాట నిలబెట్టుకుని రైతు పక్షపాతి అని మరోమారు నిరూపించుకున్నారు. రుణమాఫీతో ప్రభుత్వంపై భారీగా ఆర్థిక పడుతుందని తెలిసినా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారు.
– నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేత