Nadargul Lands | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/బడంగ్‌పేట, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ) : నాదర్గుల్ రైతులు కదంతొక్కారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములకు దూరమై భూపోరాటానికి దిగిన రైతు కుటుంబాలు.. శుక్రవారం మరోసారి తమ భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్సైన్యంపై విరుచుకుపడ్డారు.
ఆ కంపెనీలు వేసిన రేకుల కంచెను దాటుకొని, పోలీసులు, బౌన్సర్లను సైతం లెక్క చేయకుండా భూముల్లోకి చొచ్చుకొని వెళ్లారు. ఈ అనూహ్య పరిణామాలతో అక్కడ కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొన్నది. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌ను తీసుకొని లోపలికి పోయేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు మెయిన్ గేటు వద్దే నిలువరించారు. చాలాసేపు వాగ్వాదం చేసిన తర్వాత గేటు తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు తాళ్లు పట్టుకొని గేటుకు అడ్డుగా రక్షణ వలయంగా నిల్చున్నా రైతులు లెక్క చేయలేదు.
ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ ముందుకు తోసుకుంటూ వెళ్లారు. లోపలి వైపు ప్రైవేట్ సైన్యం గేటును అదిమిపట్టినా రైతులు పట్టువీడకపోవడంతో ఒక్కసారిగా గేటు తెరుచుకుంది. దీంతో పదుల సంఖ్యలో రైతులు లోపలికి వెళ్లి బౌన్సర్లను తరిమికొట్టారు. ఒకేసారి పెద్ద ఎత్తున రైతులు రావడంతో బౌన్సర్లు భయంతో భూముల్లోకి పరుగులు తీశారు.
రెండేండ్లుగా తమల్ని తమ భూముల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న బౌన్సర్లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు వారిని ఉరికించారు. ఈ క్రమంలో కొంతమంది బౌన్సర్లు గుంతల్లో పడిపోగా మరికొందరిని రైతులు పట్టుకొని దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే ఎవరిపైనా దాడులు చేయొద్దని విశారదన్ మహరాజ్ వచ్చి రైతుల్ని వారించి, బౌన్సర్లను అక్కడినుంచి పంపించారు. ఆ తర్వాత రైతులు భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్ కంపెనీలు ధ్వంసం చేసిన బోర్లను, బావులను పూడ్చిన తీరును విశారదన్ మహరాజ్‌కు చూపించారు. పొలాల కోసం వేసుకున్న పైపులను కూడా ధ్వంసం చేశారని, కాలువలను లేకుండా చేశారని, కరెంటు వైర్లను తగులబెట్టారని రైతులు వాటిని చూపుతూ ఆవేదన చెందారు. చాలాకాలం తర్వాత పొలాల్లోకి వెళ్లినందుకు రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు.
రాజకీయాలు చేయడం మానుకొని రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని నాదర్గుల్ రైతులు కాంగ్రెస్ నేతలకు తెగేసి చెప్పారు. ప్రతిరోజూ రైతులు వంటావార్పుతో పాటు పలు రీతుల్లో నిరసన కొనసాగిస్తుండగా భూపోరాటానికి బీఆర్ఎస్ సహా వామపక్ష పార్టీలు, ఇతర ప్రజాసంఘాలు వారికి మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సంఘీభావం తెలుపుదామని భావించారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశానుసారం స్థానిక నాయకులు శుక్రవారం రైతుల వద్దకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చీరాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పించడంతో రైతులు అడ్డుకున్నారు. రెండున్నరేండ్లుగా భూముల్లోకి వెళ్లనివ్వకుండా ప్రైవేట్ కంపెనీలు ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోలేదని రైతులు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దల వద్దకు వెళ్తే ఎవరూ న్యాయం చేయలేదని, గోడు వినలేదని ప్రశ్నించారు.
మీడియాలో వచ్చిన తర్వాతే తమకు ధైర్యం వచ్చిందని చెప్పారు. ఐదు రోజులుగా వంటావార్పు, నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మీడియా సంస్థలు, వివిధ పార్టీలు, సంఘాలు వచ్చి మద్దతునిచ్చారే గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారా? అని నిలదీశారు. ఇవి ప్రభుత్వ భూములే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశంలో చెప్పి కంపెనీలకు వత్తాసు పలికారే గానీ రైతుల గురించి ఒక్కమాటైనా చెప్పలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతలను విమర్శించడం కాదు, రైతులకు ఏం చేస్తదో చెప్పాలని పట్టుబట్టారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా.. మీరే న్యాయం చేయించాలని డిమాండ్ చేశారు. రైతులు మాటలతో ఎదురుదాడి చేయడంతో హస్తం నేతలు కంగుతిన్నారు. ఏదో అనుకుంటో ఏదో జరిగిందని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెనుదిరిగారు. వాస్తవానికి రైతుల్లో విభేదాలు సృష్టించేందుకే కాంగ్రెస్ నేతలు వచ్చారని పలువురు రైతులు ఆరోపించారు.