కొత్తగూడ, సెప్టెంబర్ 13: నెల రోజుల నుంచి తిరిగినా యూరియా దొరకక మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడ మండలం భూర్కుగుంపునకు చెందిన రైతు మల్లెల నర్సయ్యకు 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేస్తున్నాడు. వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో యూరియా కోసం నెల రోజులుగా పొగుళ్లపల్లి సొసైటీ, ఆగ్రోస్ సేవా కేంద్రానికి తిరుగుతున్నా ఒక్క బస్తా కూడా దొరకలేదు. శనివారం తన పొలాన్ని చూసిన రైతు పొట్టకొచ్చిన పంట చేతికందదనే ఆవేదనతో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు బాధితుడిని కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్య సిబ్బంది 108 వాహనంలో వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది పరామర్శ
బాధితుడు మల్లెల నర్సయ్యను నర్సంపేటలోని ప్రభుత్వ దవాఖానలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి నర్సయ్యకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం విచాకరమన్నారు. మంత్రి సీతక్క ఇలాకాలోనే ఎరువులు దొరకకపోవడంతో ప్రభుత్వంపై రైతన్నలు దుమ్మెత్తిపోస్తున్నారని తెలిపారు. నర్సయ్యను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణు, మండల ప్రతినిధి బానోత్ నెహ్రూ పరామర్శించారు.