ధర్మారం, ఏప్రిల్ 25: కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబెట్టిన అనంతరం ఇంటికి వెళ్తుండగా వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లిలో జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట రాజయ్య(69) గ్రామ శివారులో కొనుగోలు కేంద్రంలో పోసిన వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు శుక్రవారం మధ్యాహ్నం సైకిల్‌పై వెళ్లాడు. వడ్లను నేర్పిన అనంతరం ఎండలో ఇంటికి తిరుగు పయనమయ్యాడు.
మార్గంమధ్యలోనే రాజయ్య తీవ్ర అస్వస్థతకు గురై పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స కోసం పెద్దపల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు రాజయ్య అప్పటికే మృతిచెందినట్టు తెలిపారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శీలం లక్ష్మణ్ వివరించారు.