గణపురం, జనవరి 30: పంటలు పండకపోవడం, అప్పులు తీర్చలేక రెకల కష్టం చేసుకొని బతుకుతున్న రైతు రుణమాఫీపై గంపెడాశలు పెట్టుకున్నాడు. అటు రుణమాఫీ కాక ఇటు రైతు భరోసా లేక తీవ్ర మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెం దాడు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపురంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట వెంకటేశ్వర్లు(46) తన ఎకరం 28 గుంటల భూమిలో మిర్చి, వరి సాగు చేశాడు.
కాలం కలిసిరాక దిగుబడి సరిగా రాక అప్పుల పాలయ్యాడు. పంటపై రుణం తీసుకున్న 60 వేలు ప్రభుత్వం మాఫీ చేయలేదు. అప్పులు తీర్చలేక మనోవేదనకు గురయ్యా డు. గురువారం తన పంట చేను వద్దకు వెళ్లి వచ్చిన వెంకటేశ్వర్లుకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని వంద పడకల దవాఖానకు తరలించారు. అప్పటికే వెంకటేశ్వర్లు మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.