సిరికొండ, మార్చి 19: మోటర్ స్టార్టర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పందిమడుగు దూప్యతండాలో చోటు చేసుకున్నది. తండాకు చెందిన రైతు మలావత్ రమేశ్ (45)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన.. మంగళవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లారు. మోటర్ నడవడం లేదని గుర్తించి స్టార్టర్ మరమ్మతులు చేస్తుండగా, విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతూ పొలానికి వెళ్లగా, అక్కడ రమేశ్ విగతజీవిగా కనిపించాడు.