రేవల్లి, సెప్టెంబర్ 3 : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పునూరు శివారులో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్పునూరుకు చెందిన చాగల రాములు(50) మూడెకరాల్లో వరి సాగు చేశాడు. బుధవారం పొలానికి వెళ్లిన ఆయన కేఎల్ఐ కాలువలో దించిన మోటరు వద్ద నాచు తీయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మధ్యాహ్నం నుంచి కుమారులు రాములుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో చిన్న కుమారుడు ఆంజనేయులు వచ్చి పొలంలో చూసినా కనిపించలేదు. పక్కనే ఉన్న కేఎల్ఐ కాలువ మోటరు వద్దకు వెళ్లి చూడగా నీళ్లలో మృతి చెంది తేలుతూ కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహించారు.