ఖమ్మం : నీళ్ల కోసం మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్(Electric shock) తగిలి యువ రైతు మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈర్లపూడి గ్రామానికి చెందిన యువ రైతు ముత్తంశెట్టి నర్సింహారావు(27) తనకున్న రెండెకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేశాడు. వరుస వర్షాలు కాస్త తెరిపివ్వడంతో చేనులో కలుపు మందు కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నీళ్ల కోసం బోర్ వద్ద మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు నర్సింహారావుకు ఏడాదిన్నర క్రితమే పెళ్లి కాగా.. భార్య, ఆరు నెలల పాప ఉన్నారు. కాగా.. ఇంటి వద్ద అప్పుడే కుమార్తెను ఆడించి వెళ్లిన నర్సింహారావు కాసేపట్లోనే విద్యుత్ షాక్తో మృతిచెందినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో అందరితో సరదాగా ఉండే నర్సింహారావు మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.