ధర్మపురి, మే 20 : బీర తోటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు వైరు తగిలి కరెంట్ షాక్‌కు గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరండ్లపల్లి శివారులో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి చెందిన కటం శంకరయ్య (60)కు మండలంలోని కోరండ్లపల్లి శివారులో వ్యవసాయ భూమి ఉన్నది.
కొంత భూమిలో బీరతోట సాగు చేస్తున్నాడు. రోజుమాదిరిగానే బుధవారం సాయంత్రం బీర తోటకు నీళ్లు కడుతున్నాడు. అప్పటికే తెగిపడిన కరెంటు మోటర్ మెయిన్ వైర్‌ను గమనించకుం డా చేయి తగలడంతో షాక్‌కు గురయ్యాడు. స్థానికులు ధర్మపురిలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందాడు. భార్య గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.