నల్లగొండ, మార్చి 4: సహకార బ్యాంకు అధికారుల వేధింపులతో ఓ దివ్యాంగ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ‘27 ఏండ్ల కిందట మీ నాన్న తీసుకున్న రూ.40 వేల అప్పు ఇప్పుడు వడ్డీతో 1.68 లక్షలు అయ్యింది.. మీరు చెల్లిస్తే సరి.. లేదంటే భూమి వేలం వేస్తాం’ అని బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురై గడ్డిమందు తాగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు సదరు రైతు.
వివరాలు ఇలా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం గడ్డంవారి ఎడవెల్లికి చెందిన రైతు గౌని భిక్షమయ్య 1998లో ఎడవెల్లి ప్రాథమిక సహకార బ్యాంకులో పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ పెట్టి రూ.40 వేలు రుణం తెచ్చుకున్నాడు.
ఆ సమయంలో నాలుగెకరాల భూమిని బ్యాంకు వాళ్లు మార్టిగేజ్ చేసుకోగా, కొద్దిరోజులకు భిక్షమయ్య తీసుకున్న డబ్బులు చెల్లించి పాస్‌పుస్తకాలు తీసుకొచ్చాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మార్టిగేజ్ విషయమై అవగాహన లేక వదిలేసినట్టు వారు పేర్కొన్నారు. ఆ తర్వాత పాత పాస్‌పుస్తకాల స్థానంలో గత బీఆర్ఎస్ సర్కారులో ధరణి పాస్ పుస్తకాలు వచ్చాయి. వాటిని యూనియన్ బ్యాంకులో పెట్టి భిక్షమయ్య తన పేరు మీద రెండు లక్షల పంట రుణం తీసుకున్నాడు.
కొంతకాలానికి ఆ మొత్తం తిరిగి చెల్లించి నాలుగేండ్ల కింద తన భూమిని కొడుకు వెంకన్న, కోడలు రాణి, మనమడు భానుప్రసాద్ మీద ఫౌతి చేశాడు. అనంతరం వెంకన్న, రాణి అదే బ్యాంకులో వ్యవసాయ అవసరాల కోసం 1.90 లక్షల రుణం తీసుకున్నారు. కాగా రెండ్రోజుల కిందట సదరు భూమి పీఏసీఎస్‌కు చెందిందని అంటూ సహకార బ్యాంకు అధికారులు జెండాలు పాతారు. ఈ నెల 19లోగా మొత్తం రుణం వడ్డీతోసహా చెల్లించాలని బెదిరింపులకు దిగారు. కలత చెందిన వెంకన్న సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకు న్న రైతులను తిరిగి కట్టాలని అధికారులు ఒత్తిడి చేయొద్దని రైతు సంఘం రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి పశ్యపద్మ సూచించారు.