ఇచ్చోడ, జూన్ 16 : జొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్నకు చెందిన రైతు నుగురే పాండురంగ్ (48) పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పాండురంగ్‌కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఇందులో జొన్న సాగు చేయగా.. 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సిరిసంపద కొనుగోలు కేంద్రానికి జొన్నలను మే 23న తీసుకురాగా తూకంవేసి లాట్ నంబర్ ఇచ్చారు.
ఇప్పటివరకు పంటను లోడ్ చేయకపోవడంతో మనస్తాపానికిగురై మార్కెట్ యార్డులో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. పాండురంగ్ భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.