Harish Rao | ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మరణాలకు ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యులని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గు చేటు అని విమర్శించారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సోమవారం నాడు హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శించిన అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. సాగునీళ్లు అందించడంలో, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో, కొనుగోలుచేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ కూడా ధాన్యం కొనలేదని.. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తూ రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. ధాన్యం కుప్పలపైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 15న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జలపతిరెడ్డి అనే రైతు మృతి చెందాడని, ఏప్రిల్ 21న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో హనుమండ్ల ప్రేమలత అనే మహిళా రైతు హఠాన్మరణం చెందిందని, ఏప్రిల్ 22న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి కొనుగోలు కేంద్రంలో బిర్రు వెంకన్న ప్రాణాలు కోల్పోయాడని, ఏప్రిల్ 26న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ చింతకింది హనుమయ్య కుప్పకూలాడని తెలిపారు. ధాన్యపు రాశులే సాక్ష్యంగా, కొనుగోలు కేంద్రాల్లోనే జరుగుతున్న ఈ రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ఇవి సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఈ మరణాలకు బాధ్యులు అని అన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, వారి ప్రాణాల మీదకు తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాగు నీళ్లు అందించడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం, కాంటాలు పెట్టడంలో వైఫల్యం, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం, బడాయిగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యమని హరీశ్‌రావు అన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు అని విమర్శించారు. రైతులు ప్రాణులు కోల్పోతుంటే ఏం ముఖం పెట్టుకొని వేడుకలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ, అన్నదాతల ఆవేదనపై లేకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. అందాల పోటీలపై పోటీ పడి సమీక్షలు నిర్వహిస్తున్న నాయకులకు, కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పకూలుతున్న రైతున్నల గుండె కోత వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు దినదినగండంగా గడుపుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని హరీశ్‌రావు అన్నారు. ఒక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకు, ఇంకెందుకో తెలియదు గానీ ప్రకృతి పగ పట్టినట్టుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారని.. పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రహసనంగా మారిందని అన్నారు. ధాన్యం అమ్మిన డబ్బులు 10 రోజులు దాటుతున్నా రైతులకు చెల్లించడం లేదని తెలిపారు. ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఉత్త మాటలే అయ్యాయని అన్నారు. 70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు 24.43 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని అన్నారు. దీని విలువ రూ. 5664 కోట్లు అని.. చెల్లించింది మాత్రం రూ. 3163 కోట్లు అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం.. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాల కొద్దీ వేచి చూసినా కాంటాలు కావడం లేదని హరీశ్‌రావు తెలిపారు. టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంతో, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నాయని అన్నారు. వివిధ కారణాలు చెప్పి 5 కిలోల దాకా తరుగు తీస్తుండటం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని చెప్పారు.