రామాయంపేట, ఫిబ్రవరి1: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. డీ ధర్మారం గ్రామానికి చెందిన రైతు పెండెల కృష్ణ (45) నిరుడు తన పొలంలో 4 బోర్లు వేయడంతో రూ.6 లక్షల వరకు అప్పు అయ్యింది. బోర్లలో నీళ్లు సరిగా కపోవడంతో పంటలు పండలేదు. రైతుభరోసా సైతం రాకపోవడంతో దిగాలు చెందాడు. అప్పులు తీర్చే మార్గం కనబడక తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లో నుంచి పొలానికి నీరు పారిస్తానని శనివారం రాత్రి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు.
దీంతో ఆయన కుటుంబం అదే రాత్రి వెళ్లి చూడగా వ్యవసాయ పొలంలోనే పురుగుమందు తాగి పడిఉన్నాడు. కుటుంబీకులు నార్సింగిలోని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.