జగదేవ్పూర్, జనవరి 30 : సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. జగదేవ్పూర్ మండలం గొల్లిపల్లికి చెందిన రైతు దొమ్మల చిన్నకిష్టయ్య (50) తనకున్న ఎకరన్నర పొలంతోపాటు మరో ఏడెకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగుచేశాడు. సాగు కలిసి రాకపోవడంతో అప్పులు అధికమయ్యాయి. ఎకరన్నర వరి, ఏడు ఎకరాల పత్తి సాగు కోసం, నిరుడు చిన్నకూతురు వివాహం చేయగా మొత్తం కలిపి రూ.15 లక్షలు అప్పులయ్యాయి.
దిగుబడులు అంతంత మాత్రంగానే రావడంతో చేసిన అప్పులకు వడ్డీలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అప్పులు తీర్చేమార్గం కన్పించక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం సాయంత్రం ఇంటి వెనుక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.