నర్సాపూర్, సెప్టెంబర్ 21: అప్పుల బాధలు భరించలేక రాష్ట్రంలో మరో అన్నదాత తనవు చాలించాడు. అప్పులు తీర్చేమార్గం కనిపించకపోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుజాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జున్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన రైతు హళావత్ శ్రీనివాస్ (41) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన వ్యవసాయంతోపాటు కుటుంబ అవసరాలకు రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా ఆందోళన చెందుతున్నాడు.
శనివారం తెల్లవారుజామున బయటకెళ్తున్నట్టు భార్య హళావత్ లక్ష్మీకి చెప్పి బయలుదేరాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య లక్ష్మి చుట్టుపక్కల వాకబు చేసింది. అంతటా వెతకగా ఉదయం 6 గంటల సమయంలో తన ఇంటి వెనకాల పొలంలో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపారు.