గుడిహత్నూర్, డిసెంబర్ 28: రుణమాఫీ కాలేదని పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం టాకిగూడలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వాగుమూడే రాజేందర్ (53) గుడిహత్నూర్‌లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో రూ.2.50 లక్షల పంట రుణం తీసుకున్నాడు. ఇటీవల ప్రభుత్వం చేసిన నాలుగో విడుత రుణమాఫీ జాబితాలో రాజేందర్ పేరు రాలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలన్న బెంగతో మనస్తాపానికిగురై గురువారం సాయంత్రం ఇంట్లో పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందడంతో టాకిగూడలో విషాదం నెలకొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు.