కురవి, మే 8: అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేఘ్యాతండాకు చెందిన బానోత్మంగ్యా (70)కు 30 గుంటల వ్యవసాయ భూమి ఉంది. పంట సాగు చేసినా ఆశించిన దిగుబడి లేక నష్టపోయాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన భార్యకు వైద్యం ఖర్చులు, ఇంటి నిర్మాణంకోసం రూ.15 లక్షల అప్పు చేశాడు.
భూమి అమ్మినా అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడడంతో ఆవేదన చెందిన మంగ్యా గురువారం సాయంత్రం పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌లోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అదే రాత్రి మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుడి కుమారుడు హతీరాం ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కురవి ఎస్సై సతీశ్ తెలిపారు.