రేగొండ, ఏప్రిల్ 15: అప్పుల బాధతో మరో రైతు మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లా గోరి కొత్తపల్లి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన బుల్లవేణి రాజయ్య (59) అనే రైతు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్యయత్నం చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మరణించారు. వేసిన పంటలు ఎండిపోవడంతోపాటు సరైన గిట్టుబాటు ధర లేక అప్పులు పెరిగిపోయయని, ఎలా తీర్చాలనే మనోవేదనతో పురుగుల మందు తాగాడని రాజయ్య బంధువులు వెల్లడించారు. మృతునికి భార్యా, కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.