తలమడుగు, జూలై 21 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామానికి చెందిన రైతు ముక్కెర సంతోష్(47) అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. సంతోష్‌కు ఐదెకరాల ఎనిమిది గుంటల భూమి ఉన్నది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రూ.2.50 లక్షల రుణం తీసుకున్నాడు. నిరుడు పత్తి, జొన్న సాగు చేయగా దిగుబడి సరిగ్గా రాలేదు.
పలువురు రైతులకు రుణమాఫీ జరిగినా, తనకు రుణమాఫీ కాలేదని ప్రతి రోజూ బాధ పడుతుండేవారు. అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాని బెంగతో సోమవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు, స్థానికులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాధిక పేర్కొన్నారు.