తాంసి(తలమడుగు), నవంబర్ 24 : అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం డోర్లి గ్రామానికి చెందిన రైతు జలారపు లింగన్న (22) తన తండ్రి కిష్టన్న పేరిట ఉన్న మూడెకరాల 30 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు.
వానకాలం సీజన్ లో పత్తి సాగు కోసం ప్రైవేటుగా రూ.3 లక్షలు అప్పు తెచ్చాడు. భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతినడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో ఆదివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. లింగన్న తల్లి విమల ఫిర్యాదు మేరకు తలమడుగు ఎస్సై రాధిక కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామాయంపేట, నవంబర్ 24: మెదక్ జిల్లా రామాయంపేట మండలం డీ ధర్మారంగ్రామానికి చెందిన రైతు కూలి నింగరమైన బాలేశ్ (26) బతుకు దెరువు కోసం కొన్నేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు.

ఈ క్రమంలో దాదాపు రూ.4 లక్షల అప్పులు అయ్యాయి. రెండేళ్లుగా గ్రామంలోనే ఉంటున్న బాలేశ్ వ్యవసాయ కూలి పనులు చేస్తున్నాడు. అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో మానసికంగా కుంగిపోయాడు. సోమవారం బాలేశ్ ఓ పొలంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.