తానూర్, ఏప్రిల్, 18 : సరైన పంట దిగుబడి రాలేదని నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఉమ్రి(కే)కు చెందిన కదం బాలాజీ (45) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ భానుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీ తనకున్న రెండు ఎకరాల్లో పంట సాగు చేయగా సరైన దిగుబడి రాలేదు. దీంతో పెట్టుబడి అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపం చెంది గురువారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ట్రైనీ ఎస్ఐ నవనీత్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మోనాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఏఎస్ఐ తెలిపారు. కాగా బాలాజీ ఆర్థిక ఇబ్బందులతో గతంలో కూడా పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు కాపాడారు.