పాలకుర్తి రూరల్, మార్చి 17: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం కోతులాబాద్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గాదరి సంజీవ (34)కు గ్రామంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో మక్కజొన్న, వరి పంటలు వేయగా నష్టం వచ్చింది. నిన్న మొన్నటి దాకా పోసిన బోరులో నీరు లేకపోవడంతో పంట ఎండిపోయింది. దీనికితోడు ఇల్లు కట్టుకోవడానికి తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి మనస్తాపం చెందాడు. తన వ్యవసాయ బావి వద్ద శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన స్థ్ధానికులు సంజీవను వెంటనే జనగామ ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో సంజీవ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం సాయిప్రసన్నకుమార్ తెలిపారు.