దుబ్బాక, జూన్ 11 : ఆర్థిక ఇబ్బందులు రైతుకూలీ ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట చౌరస్తాలో చోటుచేసుకుంది. ధర్మాజీపేటకు చెందిన దివిటి నల్లగొండ(41) గ్రామంలో వ్యవసాయంతో పా టు ఇతర కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో కిడ్నీ సమస్యతో పాటు నెల రోజుల క్రితం గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
ఇందుకు ఉన్న ఇంటి స్థలం విక్రయించాడు. అయినా ఆరోగ్యం కుదుట పడక చేసిన అప్పులు పెరిగిపోవడంతో మానసికంగా కలత చెందాడు. బుధవారం ఉదయం ధర్మాజీపేట-హబ్షీపూర్ చౌరస్తా సమీపంలో ఒక చెట్టుకు ఉరివేసుకున్న నల్లగొండ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు ఎస్సై గంగరాజు తెలిపారు.