తొగుట, జూలై 25: అప్పుల బాధతో ఓ రై తు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుటలో చోటుచేసుకున్నది. తొగుట ఎస్సై రవికాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. తొగుటకు చెందిన బండారు మహేశ్ (35)కు 20 గుంటల పొలం ఉన్నది. సాగు కోసం రూ.50 వేల అప్పు చేయగా దిగుబడులు రాక నష్టపోయాడు. అదీగాక కుటుంబ అవసరాలు, వైద్యం కోసం మరో రూ.2 లక్షల అప్పు చేశాడు. సాగు కలిసి రాక.. చేసిన అప్పులు తీర్చలేక కుంగిపోయాడు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈనెల 22న భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్తాపం చెందిన ఆయన అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటి నుంచి వెళ్లిపోయి గడ్డి మందు తాగాడు. బంధువులు గుర్తించి సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో చేర్పించగా పరిస్థితి విషయమించి శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.