ఎదులాపురం, మే 30 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్కంటి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు బండారి మల్లేశ్(46) పూసయి గ్రామంలో 15 ఎకరాలు, కచ్కంటి గ్రామంలో 9 ఎకరాల్లో సాగు చేయడానికి అప్పు చేశాడు. సరైన దిగుబడి రాకపోవడం, పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల అప్పులు పెరిగిపోయాయి. నిరుడు కుమార్తె వివాహానికి కూడా కొంత అప్పు తీసుకున్నాడు. ఇవన్నీ భారం కావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా, రాత్రి పొలంలో స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మల్లేశ్ భార్య కుసుమ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వీ విష్ణువర్ధన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.