హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమని తీవ్రంగా మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విద్యార్థులకు అప్లికేషన్లు కూడా నింపడం రాదనడం ఉపాధ్యాయులను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎకడ, ఏం మాట్లాడాలో తెలియడం లేదంటూ నిప్పులుచెరిగారు. గురువారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు.
యువ గ్రాడ్యుయేట్ల విద్యపై అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిని గద్దె దించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. విద్యార్థులను విమర్శించే ముందు సీఎం తన స్థాయిని, విద్యావ్యవస్థ వైఫల్యాలను బేరీజు వేసుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనకి తీసుకొని ఇంజినీరింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. విద్యాశాఖలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే, రేవంత్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినట్టు.. అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.