మద్దూరు (ధూళిమిట్ట), జనవరి 10: అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామ శివారు బంజరలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివారు బంజరకు చెందిన ఇండ్ల సిద్ధిరాములు(60)కు భార్య తారమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
సిద్ధిరాములు తన భార్యతో కలిసి గ్రామంలో తనకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి ఇద్దరు కుమారులు మధు, స్వామి కొన్నేండ్ల క్రితమే బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వ్యవసాయానికి సరిపడా సాగునీరు లేకపోవడంతో సిద్ధిరాములు నిరుడు బోరు బావిని తవ్వించగా అందులో నీరు పడలేదు. నీళ్లు లేక రెండెకరాల భూమిని కంచెకు వదిలిపెట్టి, మరో రెండెకరాల్లో వరి సాగుచేశాడు.
బోరుబావిని తవ్వించేందుకు, వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడి కోసం సుమారు రూ. 5 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. వాటికి వడ్డీ పెరిగిపోతుండటంతోపాటు ఆశించిన దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా కుంగిపోయాడు. భార్య తారమ్మ తన కూతురు ఇంటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం తెల్లవారుజామున తన ఇంటి ముందు ఉన్న పందిరి కర్రకు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పందిరికి వేలాడుతున్న సిద్ధిరాములు మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రైతు సిద్ధిరాములు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరారు.