కూసుమంచి, జనవరి 17: సాగు కలిసి రాక.. అప్పులు తీర్చలేక ఖమ్మం జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన వడ్తియా నవీన్‌కుమార్ (33) తనకున్న అర ఎకరం పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. చుట్టుపక్కల మామి డి తోటల్లో మొక్కలు అంటుగట్టే పనికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో అతడు కొన్ని అప్పులు చేశాడు. వాటిని తిరిగి చెల్లించాలని ఒత్తిడి పెరిగింది.
అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక మనస్తాపానికి గురయ్యాడు. పని కోసమని చెప్పి 10 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లాడు. నవీన్‌కుమార్ ఇంటికి తిరిగి రాకపోగా.. గురువారం నుంచి అతడి మొబైల్ ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు వెతకడం మొదలుపెట్టారు. లోక్యాతండా – కూసుమంచి మార్గంలో అతడి వ్యవసాయ భూమిలోనే చెట్టుకు వేలాడుతూ విగత జీవిగా కన్పించాడు. నవీన్ భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.