రామన్నపేట, జూలై 8: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన మైల సురేశ్ (32) తనకున్న ఎకరం పొలంతో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పెట్టుబడికి యూనియన్ బ్యాంక్ నుంచి రూ.ఐదున్నర లక్షలు, స్నేహితుల నుంచి మరికొంత అప్పు తీసుకొన్నాడు. దిగుబడులు సరిగా రాక అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంగళవారం రాత్రి ఇంటి పైకప్పునకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.