పర్వతగిరి, జనవరి 12: అప్పులబాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారు సోమ్లా తండాలో జరిగింది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమ్లాతండాకు చెందిన భూక్యా వెంకన్న (24)కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇందులో ఎనిమిది ఎకరాల్లో పత్తి, నాలుగు ఎకరాల్లో వరి వేశాడు. పత్తి పంటలో దిగుబడులు ఆశించినంత రాలేదు.
దీంతో సుమారు రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. మరోవైపు రైతుభరోసా పథకంలో పంట సాయం అందలేదు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక వెంకన్న ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభుత్వం రైతు వెంకన్న కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరారు.