టేకుమట్ల, మే 11 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బకపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు మాదారపు భాసర్రావు (44)కు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆశించిన స్థాయిలో పంటలు పండక సుమారు రూ.18 లక్షల అప్పు అయ్యింది. గ్రామంలో వ్యవసాయం చేస్తూ అప్పులు తీర్చడం సాధ్యంకాక హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవలే తన స్వగ్రామం సుబ్బకపల్లికి వచ్చాడు. మళ్లీ హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి శనివారం పొలానికి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. మృతుని తల్లి వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రసాద్ తెలిపారు.