కౌడిపల్లి, ఏప్రిల్ 25 : అప్పుల బాధతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి శివారులోని భట్టెమ్మ గుడి సమీపంలో శనివారం చోటుచేసుకున్నది. కౌడిపల్లి ఎస్సై అమరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకా రం.. కొల్చారం మండలం వరిగుంతం గ్రామానికి చెందిన రైతు శాగ్గారి నరేందర్‌గౌడ్ (52) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. పొలానికి నీరందక నాలుగు ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయింది. సాగు పెట్టుబడి కోసం కెనరా బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. పంట ఎండిపోవడంతో వ్యవసా యం కోసం చేసిన అప్పులు మీదపడ్డా యి. కుటుంబపోషణ కోసం కౌడిపల్లిలోని ఓ వైన్‌షాప్ పర్మిట్ రూమ్‌లో పనికి కుదిరాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొన్నిరోజులుగా మదనపడుతున్నాడు. శుక్రవారం భార్యతో కలిసి హైదరాబాద్‌లోని కూతురు ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం కౌడిపల్లికి పనికి పోతానని ఇంట్లోచెప్పి బయలుదేరాడు. కౌడిపల్లికి వచ్చిన తర్వాత.. చనిపోతున్నానని కొడుకు మొబైల్‌కు మెసేజ్ చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు కౌడిపల్లికి వచ్చి వెతుకుతుండగా అటవీప్రాంతంలోని భట్టెమ్మ గుడి వద్ద చెట్టుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.