జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడులో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, మృతుడి భార్య శకుంతల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి అశోక్ (40) తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేస్తున్నాడు.
వరుసగా పంట నష్టం రావడంతో రూ.7 లక్షల వరకు అప్పులయ్యాయి. దీనికితోడు కూతురు పెండ్లి ఎలా చేయాలం టూ రోజూ బాధపడేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అశోక్ ఈ నెల 8న క్రిమిసంహారకమందు తాగగా గుర్తించిన కుటుంబసభ్యులు వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడికి కుమారుడు శశివర్ధన్, కుమార్తె శ్రీజ ఉన్నారు.