తాంసి, ఫిబ్రవరి 8 : దిగుబడులు లేక అప్పులపాలై ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పాలోడి గ్రామం లో చోటుచేసుకున్నది. పాలోడి గ్రామానికి చెందిన రైతు సిరికొండ చందర్ (44) తనకున్న ఐదెకరాల్లో పత్తి, కంది సాగుచేశాడు. ఇందుకోసం రూ.7 లక్షలు అప్పుచేశాడు. అకాల వర్షాలతో తగిన దిగుబడి రాలేదు. ఈ క్రమంలో అప్పు లు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామ శివారులో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు చూసి వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. చందర్‌కు భార్య సవిత, కుమారుడు, కూతురు ఉన్నారు.