కురవి, డిసెంబర్ 7 : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ వివరాల ప్రకారం.. కురవి మండలం నారాయణపురం శివారు పాతతండాకు చెందిన రైతు భూక్యా జామ్లా (58) తనకున్న ఎకరం 10 గుంటలతోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని మిరప, పత్తి పంటలు సాగుచేశాడు. పంట పెట్టుబడి, ఇంటి ఖర్చుల కోసం రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలని భూక్యా జామ్లా మనోవేదనకు గురయ్యాడు.
శనివారం తన పొలంలో గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు మహబూబాబాద్‌లోని దవాఖానకు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.