పెద్దవంగర, నవంబర్ 4: దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం పోచారం గ్రామ శివారులోని భద్రుతండాకు చెందిన ధరావత్ సోమాని (42) తనకున్న మూడు ఎకరాలను ఆర్థిక ఇబ్బందులతో గతంలోనే ఎకరం అమ్మాడు. మిగిలిన రెండు ఎకరాల్లో వరి, పత్తి, మక్కజొన్న సాగు చేశాడు. సరైన దిగుబడి రాలేదు. దీనికితోడు ఇటీవల కూతురు వివాహం చేయడంతో దాదాపు రూ. 10 లక్షల వరకు అప్పులయ్యాయి. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తీవ్రమనస్తాపం చెందిన ఆయన సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందాడు. సోమాని కొడుకు ధరావత్ వేణు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.