నెన్నెల, అక్టోబర్ 15: వర్షాల కారణంగా పంట దెబ్బతినగా.. సాగు కోసం చేసిన అప్పు భారంగా మారడంతో తీవ్ర మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని గంగారం గ్రామ పరిధిలో చోటుచేసుకున్నది. గంగారం గ్రామానికి చెందిన కడారి బక్కయ్య (40) యాసంగిలో మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. కోతకు వచ్చేసరికి అకాల వర్షాలతో పంట చేతికి రాకుండా పోయింది. సుమారు రూ.3 లక్షల వరకు అప్పు కాగా, వాటికి వడ్డీలు పెరగడంతో రైతు కడారి బక్కయ్య మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆయన ఈ నెల 3వ తేదీన ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మంచిర్యాల దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రసాద్ తెలిపారు.