పర్వతగిరి, అక్టోబర్ 9 : ఓ వైపు దిగుబడులు రాక.. మరో వైపు కొడుకు వైద్య ఖర్చులకు అప్పులు కావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకున్నది. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన రైతు మద్దెల శ్రీనివాస్ (44) తనకున్న ఎకరన్నర భూమిలో వేసి పంట చేతికి రాలేదు. మరోపక్క కొడుకు వంశీకి గతేడాది జరిగిన ప్రమాదంలో గాయపడగా, చికిత్స నిమిత్తం లక్షలాది రూపాయల అప్పు చేశాడు. సుమారు రూ.12 లక్షలకుపైగా అప్పులు కాగా, వాటిని తీర్చేమార్గం కానరాక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. 8వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులు భోనం చేసి నిద్రిస్తున్న సమయంలో శ్రీనివాస్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం తెల్లవారు జామున 2 గంటలకు కుటుంబసభ్యులు గుర్తించారు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
తాడూరు/వెల్గటూర్, అక్టోబర్ 9 : పొలానికి వెళ్లిన ఇద్దరు రైతులు కరెంట్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనలు నాగర్‌కర్నూల్, జగిత్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం అల్లాపూర్‌కు చెందిన రైతు భరత్ (32) గురువారం సాయంత్రం వ్యవసాయ మోటర్లకు సంబంధించిన విద్యుత్తు వైర్లను సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భరత్‌కు భార్య సంతోషితోపాటు కుమారుడు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లికి చెందిన కోట కనుకయ్య అనే రైతు తన పత్తి చేనును అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు వైరు అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అయితే, అదే గ్రామానికి చెందిన కౌలు రైతు బింగి సతీశ్ సతీశ్ (35) గురువారం ఉదయం తన పత్తి చేనుకు మందు కొట్టేందుకు వెళ్తున్న క్రమంలో కనుకయ్య అమర్చిన విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రైతు కనుకయ్యపై కేసు నమోదు చేసి చట్టపరమైనా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.