ములుగు రూరల్, జూలై 16: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని కొత్తూరు జీపీ పరిధిలోగల యాపలగడ్డ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య(45) నిరుడు రూ.3 లక్షలు అప్పు చేసి మూడెకరా ల్లో మిర్చి సాగు చేశాడు. దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. ప్రస్తుత వానకాలంలో మూడెకరాల్లో పత్తి వేయడంతో పాటు ఎకరంలో వరి సాగు చేసేందుకు నారు పోశాడు.
నిరుడు చేసిన అప్పులకు తోడు ప్ర స్తుతం పంట పెట్టుబడి అప్పులు కావడంతో వాటిని తీర్చే విషయమై కుంగిపోయాడు. ఈనెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎం దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సమ్మయ్య బుధవారం మృతిచెందాడు.