మధిర, జూలై 1 : ‘ఇంతమట్టికీ నేను ఎవరి జోలికి పో లేదు.. రైతుగానే బతికిన.. రైతురాజ్యం వస్తే బాగుంటదని చెప్పి కాంగ్రెస్‌కి ఓటేశాను.. కాంగ్రెస్ గవర్నమెంట్‌కు ఓటేసినందుకు ఇదేనా నాకు న్యాయం.. నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు.. నేను చనిపోయిక నా కుటుంబ సభ్యులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి అంటూ ఓ రైతు సెల్ఫోన్లో ఓ వీడియో చిత్రీకరించి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజ డ్ల ప్రభాకర్(43) పురుగుల మందు డబ్బా పట్టుకొని తన బాధను ఓ వీడియోలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ప్రొద్దుటూరు రెవె న్యూ సర్వే నంబర్ 276, 277లో గల బోజడ్ల ప్రభాకర్, బోజడ్ల వీరభద్రయ్య భూమిలో సమీప చెరువు నుంచి మొరం తొలిచారు.
అదే గ్రామానికి చెందిన కూరపాటి కిశోర్, పెంట్యాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, మొగి లి శ్రీను, మొగిలి ముత్తయ్య ప్రోద్బలంతో కొం దరు వ్యక్తులు కక్షపూరితంగా తన పొలంలోని మట్టిని జేసీబీలు, ప్రొక్లెయిన్లతో చెల్లాచెదురు చేసి నాశనం చేశారని ప్రభాకర్ విలపించాడు. తహసీల్దార్ రమేశ్, ఎస్సై షేక్ నాగుల్‌మీరాకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని విలపించాడు. కలెక్టర్ కోసం సోమవారం కలెక్టరేట్‌కు వస్తే సమయం అయిపోయిందని సిబ్బంది చె ప్పారని దీంతో పురుగుల మందు తీసుకున్నానని విలపిస్తూ చెప్పాడు. ఆ వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు చేరవేయాలని కోరుకున్నాడు. తన 7ఎకరాల 10గుంటల్లో 3ఎకరాలను పూర్తిగా సర్వనాశనం చేశారని వాపోయాడు.
రైతురాజ్యం వస్తుందని తాను కాంగ్రెస్‌కు ఓటు వేశానని, ఇదేనా నాకు చేసిన న్యాయం అని బోరుమన్నా డు. తాను చనిపోయాక తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పురుగుమందు డబ్బా పట్టుకొని రెండు చేతులు జోడించి కన్నీళ్లు పెడుతూ ప్రాధేయపడ్డాడు. ప్రభాకర్ ఖమ్మం సమీపంలోని ఓ మామిడితోట దగ్గరలో పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న కొందరు ప్రభాకర్ సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రభాకర్‌ను దవాఖానకు తరలించేలోపే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.