కోడేరు, ఆగస్టు 30: భూమిలో తనకు రావాల్సిన వాటాను తన్నదమ్ములు తక్కువగా ఇచ్చారన్న మనస్తాపంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం రాజాపూర్‌లో చోటుచేసుకుంది. రాజాపూర్‌కు చెందిన రేకులపాడు బాలస్వామికి ముగ్గురు కుమారులు. బాలస్వామికి సుమారు 9 ఎకరాల భూమి ఉంది. బాలస్వామి మరణానంతరం మూడేండ్ల కిందట రేకులపాడు ఆంజనేయులుకు కేవలం 1.30 ఎకరాలు మాత్రమే ఇచ్చి.. మిగతా భూమి (సుమారు ఏడెకరాలు)ని ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు. తనకు సమాన భాగాలు కాకుండా తక్కువ భూమి ఇచ్చారంటూ అన్నదమ్ముల పంచాయితీ పెద్ద మనుషుల సమక్షంలో నడుస్తున్నది. అయినా.. ఎటూ తేలకపోవడంతో ఆంజనేయులు (40) మనస్తాపానికి గురయ్యాడు. గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఖయ్యూం తెలిపారు.