రాజన్న సిరిసిల్ల : పంటలో దిగుబడి సరిగా రాక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఓ రైతు తన పంట పొలంలో నే ఆదివారం పురుగుల మందు(Pesticide) తాగగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ విషాద కర సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతు తాళ్లపల్లి సత్తయ్య (40) తనకున్న ఎకరంతో పాటు మరికొంత భూమి చేసుకుంటూ కుటుంబాన్ని వెల్లదీస్తున్నాడు. అయితే, పంట దిగుబడి రాక తీవ్ర నష్టం వాటిల్లింది.
అయితే అప్పులు మరిన్ని పెరగడంతో తీర్చే మార్గం లేక మనస్తాపం చెందాడు. ఆదివారం పనికి వెళ్లి వస్తా నని చెప్పి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పురుగుల మందు తాగాడు. తర్వాత ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలుపగా హుటహుటిన చికిత్స కోసం సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య సరిత, కూతుళ్లు రిషిత, హర్షిత ఉన్నారు. మృతుడి భార్య సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంజనేయులు తెలిపారు. కాగా, సత్తయ్యకు కొడుకులు లేకపోవడంతో ఆమె పెద్ద కూతురు రిషిత తండ్రికి తలకొరివి పెట్టింది.