రాజంపేట, మార్చి 31: నీళ్లులేక పంట ఎండిపోగా.. అందుకోసం చేసిన అప్పులు మీదపడటంతో తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తిలో సోమవారం జరిగింది. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తిరుగుడు స్వామి (36) తనకున్న రెండెకరాల్లో వరి సాగుచేశాడు. పొలంలో వేసిన బోరు ఎత్తిపోవడంతో నీరందక పంట ఎండింది.
మరోవైపు పెట్టుబడి కోసం చేసిన అప్పుతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అప్పు తీర్చే మార్గం లేక బాధపడుతున్న రైతు సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకున్నాడు. అప్పుడే లేచి గమనించిన భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి కిందికి దింపి చూడగా స్వామి అప్పటికే మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు.