Nizamabad | నిజామాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబానికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబీమాయే ఆదెరవు అయింది. కష్టకాలంలో రూ.5 లక్షల రైతుబీమా సొమ్ము ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అప్పులు భరించలేక తనువు చాలించిన ఆ రైతు కట్టుకున్న భార్యకు, కన్నబిడ్డలకు అదే ఆసరా అయింది. కానీ, ప్రతి అంశంలో గొప్పలకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ కుటుంబాన్ని పట్టించుకోవడమే లేదు. సర్కారు నుంచి అండ దొరకక ఆ రైతు కుటుంబం ఇప్పుడు విలవిల్లాడుతున్నది. తమ పేరిట ఉన్న కొద్ది వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చిన ఆ ఇల్లాలు, పిల్లలు వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఈర నర్సింహులు (43), పద్మ దపంతులకు ఇద్దరు కూతుళ్లు. ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. నర్సింహులు తనకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కేసీఆర్ హయాంలో ఏనాడూ పంటలు ఎండిన దుస్థితిని చూడలేదు. దర్జాగా యాసంగిలోనూ పంటలు సాగుచేసి చేతినిండా డబ్బులు ఆర్జించాడు. కేసీఆర్ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వడంతో అప్పుచేసే ఖర్మ కూడా నర్సింహులుకు పట్టలేదు.
2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో రైతుభరోసా అమలు ఇప్పటికీ మొదలవ్వనేలేదు. సాగునీటి కటకట నెలకొన్నది. దీంతో చాలా మంది అన్నదాతలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దశలో ఈర నర్సింహులు సాగునీటి కోసం బోర్లు వేయించాడు. బోర్లు పడక, అప్పులే మిగిలాయి. 2024 మార్చి 9న తన కుటుంబానికి జీవనాధారమైన పంట పొలంలోనే నర్సింహులు చెట్టుకు ఉరేసుకొని తనువు చాలించాడు. దీంతో అతని భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు పెద్ద దిక్కును కోల్పోయారు. రేవంత్రెడ్డి సర్కారు హయాంలోనే ఈర నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులబాధలు చెల్లించలేక కానరాని లోకాలకు వెళ్లిన రైతు ఈర నర్సింహులుకు భార్య పద్మ, పిల్లలు నవీన, భార్గవి ఉన్నారు. ముగ్గురు ఆడబిడ్డలు కాగా, పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకొన్నది. భర్తను, పెద్ద కూతురును కోల్పోయిన పద్మ ఇప్పుడు తీవ్రమైన కష్టాల్లో మునిగిపోయింది. పిల్లలను చదివించుకుంటున్న ఆమె సర్కారు నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్నది. ఈ మేరకు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు పద్మ అర్జీ పెట్టుకున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. జీవో నంబర్ 194 ప్రకారం అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ పద్మ ప్రభుత్వాన్ని కోరుతున్నది. గత జూలై 1న కామారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు దరఖాస్తు పెట్టుకున్నది. ప్రభుత్వ సాయం కోసం బాధిత కుటుంబానికి ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వ సలహాదారు అయిన కామారెడ్డి సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించి ఆదుకోవాలని ఆ బాధిత కుటుంబం వేడుకుంటున్నది.
నా భర్త నిరుడు మార్చి 9న పొలంలోనే ఉరేసుకున్నడు. పంటకు నీళ్లు లేక అప్పులు జేసి బోర్లేసిండు. అవి కట్టలేక ప్రాణాలు తీసుకొని మమ్మల్ని ఒంటరి చేసి పోయిండు. కేసీఆర్ సారు తెచ్చిన రైతుబీమా పథకం కింద మాకు రూ.5 లక్షలు అచ్చినయ్. ఇద్దరు ఆడబిడ్డలున్నరు. పెద్ద దిక్కులేని మా కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఉన్న భూమిని కౌలుకిచ్చి నేను, నా బిడ్డలం కూలిపనులకు పోతున్నం.