చేర్యాల, ఏప్రిల్ 26 : కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ ఓ రైతు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శుక్రవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన చింతకింది హనుమయ్య (54) తనకున్న మూడెకరాలను అమ్మి కుమార్తెల పెండ్లిళ్లు చేశాడు. ఐదున్నర ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. పండించిన ధాన్యాన్ని గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి మూడు రోజుల క్రితం తీసుకొచ్చాడు. రోజూ ధాన్యాన్ని ఆరబోస్తూ అక్కడే ఎండలో ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన రైతులు హుటాహుటిన చేర్యాల దవాఖానకు తరలించగా అప్పటికే రైతు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు సరైన వసతులు కల్పించకపోవడం వల్లే రైతు హనుమయ్య వడదెబ్బతో మృతి చెందినట్టు పలువురు రైతులు ఆరోపించారు. కేవలం రోజుకు నాలుగు క్యాన్లలో నీరు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారని, కేంద్రం వద్ద కుర్చీలు, టెంటు తదితర కనీస వసతులు లేవని వారు పేర్కొన్నారు. మృతుడి కుటుంబాన్ని అదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.