గుండాల, ఆగస్టు 5 : విద్యుదాఘాతంతో యువ రైతు సజీవ దహనమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. శంభునిగూడెం గ్రామ పంచాయతీ వెన్నెలబైలుకు చెందిన రైతు పర్శిక రాజు (34) కోతుల బెడద ఉండటంతో మొక్కజొన్న చేనుకు ఉదయాన్నే బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో చేనులో ఉన్న విద్యుత్తు స్తంభం ఇన్సులేటర్ కరెంట్ తీగ రాజు కాలుకు తగిలింది.
దీంతో కరెంట్ షాక్కు గురై రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. ద్విచక్రవాహనం కాలి బూడిదయ్యింది. మృతుడికి భార్య అరుణ, కుమారుడు దేవేందర్, కుమార్తె ప్రేమేశ్వరి ఉన్నారు. రాజు ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం పోయిందని, రాజు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి న్యాయం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఆవునూరి మధు డిమాండ్ చేశారు.