నాగర్కర్నూల్, ఫిబ్రవరి 17 : పూర్తిస్థాయిలో రుణమాఫీ, రైతుభరోసా రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు తన బైక్కు నిప్పుపెట్టాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. తెలకపల్లి మండలం గోలగుండం గ్రామానికి చెందిన రైతు చందు తల్లి నిరంజనమ్మ పేరిట 2. 15 ఎకరాల పొలం ఉన్నది. బ్యాంకులో వడ్డీతో కలిపి లక్షకుపైగా అప్పు మిగిలింది. రుణమాఫీలో రూ.95 వేలు మాత్రమే మాఫీ అయ్యింది. రూ.13 వేలు అప్పు కట్టాల్సి ఉన్నది. భూమి పట్టాపాస్ పుస్తకాలు అవసరమై సోమవారం చందు బ్యాంకుకు వెళ్లి అధికారులను అడిగాడు. అప్పు మొత్తం చెల్లించి పాస్ పుస్తకాలు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి తన బైక్కు నిప్పంటించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పి అతడిని అదుపులోకి తీసుకొన్నారు.